Amit Shah Sketch : జమ్మూలో ఉగ్రవాదులను ఏరివేసే ప్లాన్.. అమిత్ షా స్కెచ్ మాములుగా లేదుగా

Amit Shah Sketch

Amit Shah Sketch

Amit Shah Sketch : అమిత్ షా..దేశానికి హోంమంత్రే కాదు..ప్రధానికి కుడి భుజం లాంటివారు. ఆయనతో ఆలోచనలు పంచుకునే మొదటి వ్యక్తి కూడా ఆయనే. దేశ రక్షణకు ఆయన రచించే వ్యూహాలు శత్రువులకు అంతు చిక్కవు. తాజాగా జమ్మూకశ్మీర్ లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రా అధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదం జాడ లేకుండా చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.  గత రెండు నెలలుగా కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

డిసెంబర్ లో రెండు సార్లు ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. రాజౌరిలో ఆర్మీ కాన్వాయ్ పై దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ నుంచి చొరబడిన 30మంది ముష్కరుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి.

ఈ ఘటనలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని భద్రతా సంస్థలకు అమిత్ షా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటాన్ని సాగిస్తుందని హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.

TAGS