US Citizen : ఆశకు ఓ హద్దంటూ ఉండదేమో కదా? అత్యాశకు పోయిన ఒక మహిళ అక్షరాలా ఆరు కోట్లు సమర్పించుకుంది. ఇప్పుడు లబోదిబో అంటే ఏం లాభం. పైగా మోసానికి పాల్పడిన ఇద్దరు ప్రబుద్ధులు ఇండియన్స్ కాగా సదరు మహిళ అమెరికన్. దీంతో ఎంబసీ, ఇండియన్ పోలీసులు ఈ కేసుపై వేగంగా స్పందించారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు టీములను రంగంలోకి దింపారు. నిందితులు కూడా పారిపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ టార్ నిమిత్తం ఇటీవల ఇండియాకు వచ్చింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఆమె పర్యటిస్తూ జోహ్రీ బజార్ లోని ఒక బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లింది. అక్కడ నగలను చూసి మోజు పడిన అమెరికన్ కొనుగోలు చేయాలని అనుకుంది. అక్షరాలా రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలను కొనుగోలు చేసింది. చాలా సంతోషంతో తన దేశం వెళ్లిపోయింది.
గత ఏప్రిల్ లో యూఎస్ లో జరిగిన ఎగ్జిబిషన్ లో ఆ నగలను ప్రదర్శనకు పెట్టింది. వాటిని చూసేందుకు వచ్చిన సందర్శకులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె వాటిని స్థానికంగా ఉన్న నగల వ్యాపారుల వద్దకు తీసుకెళ్లింది. వాటిని పరీక్షించిన వారు అవి నకిలీవని తేల్చారు. అన్ని నగల ధర కేవలం రూ. 300కు మించి ఉండదని ఇవన్నీ గిల్ట్ అని చెప్పారు. దీంతో చెరిష్ షాక్ కు గురైంది. వెంటనే జైపూర్ వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది. అయితే యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపారేశాడు.
దీంతో చెరిష్ జైపూర్ పోలీసులను ఆశ్రయించింది. యూఎస్ ఎంబసీని సాయం కోరింది. స్పందించిన ఎంబసీ అధికారులు పోలీసులను ఆదేశించారు. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 2022లో ఇన్ స్టా ద్వారా గౌరవ్ సోనీతో చెరిష్ కు పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹6 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. చెరిష్ కు గిల్ట్ నగలు అంటగట్టిన నిందితులు గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉన్నారు. ఇద్దరి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.