YCP MLA Vasantha Krishna Prasad : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ‘వైనాట్ 175’ అంటూ రెండో సారి గెలవాలనే టార్గెట్ తో ముందుకెళ్తున్న జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. వైసీపీలో ఇన్ చార్జుల మార్పుతో పాటు హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మరో ఎమ్మెల్యే ఇవాళ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. ఈమేరకు ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనుచరులతో పలుమార్లు భేటీ అయిన సదరు ఎమ్మెల్యే తుది ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే తాను ఏ పార్టీలోకి వెళ్లబోయేది ఆయన ఇవాళ క్లారిటీ ఇచ్చేయబోతున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లోనూ, జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ తరుపున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో మైలవరం నేత వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. వైసీపీ తరుఫున గెలిచిన అతికొద్ది మంది కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో కూడా ఒకరు కావడం గమనార్హం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వైఎస్ జగన్ వ్యాపార భాగస్వామి, కేసుల్లో కూడా భాగస్వామి అయిన వారిలో వసంత కూడా ఒకరు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఇవాళ గుడ్ బై చెప్పేయబోతున్నారు.
మైలవరంలో ఓ వైపు తనకు లైన్ క్లియర్ అంటూనే మంత్రి జోగి రమేశ్ కు ఈ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యానికి అనుమతించడం, స్థానికంగా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి పెరుగుతున్న ఒత్తిడి, అధిష్ఠానం తన మాటకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం లాంటి కారణాలతో వసంత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు జగన్ తో కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు.
కాగా, ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఆఫర్ ఉంది. దీంతో ఆయన ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలను వివరించి టీడీపీలో చేరికపై ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో లాంఛనంగా చేరడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం చకచకా జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తే గతంలో మైలవరంలో గెలిచిన దేవినేని ఉమకు మరో నియోజకవర్గం కేటాయించేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.