CM Chandrababu : నాటి శపథం.. నేడు నెరవేరిందిలా.. సీఎంగా సభలోకి బాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : 2019 ఎన్నికల్లో  టీడీపీ  23 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. 151 సీట్లలో వైసీపీ బలంగా ఉండడంతో అసెంబ్లీలో టీడీపీకి అప్పట్లో దినదిన గండంగా ఉండేది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్..  చంద్రబాబు టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోయేవారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన చంద్రబాబును ఏమాత్రం లెక్కచేయకుండా వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి అప్పట్లో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. కౌరవ సభలో తాను ఉండలేనని గౌరవ సభలో సీఎంగా తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు.

అలా వెళ్లిన చంద్రబాబు  రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద మోకాళ్ల మీద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఇవాళ సీఎంగా తిరిగి అడుగుపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తన సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

 ‘‘ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’’ అని తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు చంద్రబాబు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

TAGS