Kalki 2898 AD : రిలీజ్ కు ముందే రికార్డుల మోత.. ఇండియాలోనే మొదటి చిత్రంగా రేర్ ఫీట్!
Kalki 2898 AD : ‘కల్కి 2829 AD’ విడుదలకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అప్పుడే రికార్డుల మోత షురూ అయ్యింది. యూఎస్‌ఏలో కల్కి చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ కు గురవుతున్నాయి. సాధారణంగా యూఎస్ఏ ఆడియన్స్ క్లాస్, హాలీవుడ్ తరహా చిత్రాలు ఇష్టపడతారు. కల్కి అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ రేంజ్ చిత్రం. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. ఇప్పటి వరకు టీమ్ విడుదల చేసిన రెండు ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి.
దీంతో రిలీజ్ కు ముందే యూఎస్ఏలో కల్కి కాసుల వర్షం కురిపిస్తోంది. అక్కడ 500 లొకేషన్స్ లో 3000 షోలకు 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. కల్కి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $4 మిలియన్ వసూళ్లను అధిగమించింది. ఇంత పెద్ద ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ మూవీగా కల్కి రికార్డులను తిరగరాసింది. ఇక మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు ఊహించని విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలను అధిగమించినా ఆశ్చర్యం పడనవసరం లేదు.
‘కల్కి’ మైథలాజికల్ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో ప్రభాస్ భైరవ పాత్ర చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ ఇందులో భాగం అయ్యారు. ప్రతీ ట్రైలర్ లో అమితాబ్ పాత్ర ఆసక్తి కలిగిస్తోంది. ఆయన అశ్వత్థామ అనే పురాణ పాత్ర చేస్తున్నారు. భైరవ-అశ్వత్థామ తలపడడం కొత్త కాన్సెప్ట్. దీపికా పదుకొనె కేంద్రంగా కథ నడిచే అవకాశం ఉంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో కల్కిని తెరకెక్కించారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. బాహుబలి 2 అనంతరం ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. సలార్ తో కొంచెం ట్రాక్ ఎక్కారు. కల్కితో మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 27 (గురువారం)న కల్కి వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. నేటి (బుధవారం) అర్ధరాత్రి నుంచి యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.