Malla Reddy : తెలంగాణ రాజకీయాల్లో అందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ‘కారు’దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా అటు కాంగ్రెస్..ఇటు బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈక్రమంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.
సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేతలు మొదలుకుని..కాంగ్రెస్ లో చేరితే తన కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ వరకూ అన్ని విషయాలను చర్చించారని తెలిసింది. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా మహేందర్ కు టికెట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ లో చేరుతారంటూ వస్తున్న వార్తలను తాజాగా మల్లారెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ను వీడేది లేదని కేటీఆర్ తో చెప్పినట్టు సమాచారం. కాలేజీ భవనం కూల్చివేత గురించి మాట్లాడేందుకే తాను కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని కలిశానని వెల్లడించారు. తమ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇవ్వకపోయినా తాను బీఆర్ఎస్ అభ్యర్థికే సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశారు.