New Ration Cards : కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ త్వరలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. 2014 నుంచి కొత్త కార్డుల కోసం అర్హులు ఆశగా ఎదురు చూశారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ రేషన్ కార్డులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఇక.. పోర్టల్ ప్రారంభించి కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.
కొత్త కార్డులు మంజూరు
ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సమయంలో రేవంత్ కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షలు కేంద్రం జారీ చేసినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల జారీ కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే.. మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది.
భారీగా దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కానీ ‘మీ-సేవ’లో పోర్టల్ మాత్రం ఓపెన్ చేయలేదు. ప్రభుత్వ నిర్ణయం తర్వాత ‘మీ-సేవ’ పోర్టల్ ఓపెన్ చేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్పించుకునేందుకు కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే.. ఒక కుటుంబంలో భార్య-భర్త, ఇద్దరు పిల్లలుంటే.. దంపతుల పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా, ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరు లేకపోయినా కొత్త సభ్యుల చేర్పులు, తొలగింపునకు ఫ్రొఫార్మాలో తీసుకోవాలని నిర్ణయించారు.
విధి విధానాలపై కసరత్తు
మీ-సేవలో మెంబర్ అడిషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే.. మెంబర్ అడిషన్‌పై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలు పూర్తిచేస్తే రేషన్ కార్డుల సమస్య కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీంతో, రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ విధి విధానాల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.