Rushikonda Palace Mystery : రుషికొండ ప్యాలెస్ మిస్టరీ వీడింది. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలకు సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. విశాఖ రుషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో క్యాంప్ ఆఫీసు నిర్మించారు. ఈ భవన నిర్మాణం అప్పట్లో వివాదాస్పదం అయింది. రుషికొండను బొడిగుండులా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు రుషికొండపై భవనాలను సందర్శించాయి. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఈ భవనాలను చూసేందుకు అధికారులు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకోవాలని జగన్ ప్రభుత్వం భావించింది.
ఇన్నాళ్లు ఎవరినీ అనుమతించకుండా.. ఏం నిర్మించారో తెలుసుకునేందుకు కొందరు నాయకులు భవనాల సందర్శనకు వెళ్లారు. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నీచర్ సుమారు రూ. 500 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు చూసి అవాక్కయ్యారు. రుషికొండ ప్యాలెస్ లో రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవని గత జగన్ ప్రభుత్వం సర్కార్ కూల్చివేసింది. రుషికొండపై ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారో చెప్పాలని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలు ప్రారంభించిందన్నారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకని నేతలు ప్రశ్నిస్తున్నారు. రుషికొండపై 61 ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారు.