Banks in AP : ఏపీలో ఈ బ్యాంకుల విలీనం.. ఇక కనిపించవు
banks in AP : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ బ్యాంకులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఈ బ్యాంకులు ఒకే పేరుతో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.
సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లను విలీనం చేసి ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’గా ఏర్పాటు చేశారు. ఈ నూతన బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
రాష్ట్రంలోని ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులు ఇప్పటివరకు వేర్వేరు పేర్లతో తమ కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై అన్నీ ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’ పేరుతోనే లావాదేవీలు నిర్వహించనున్నాయి. ఈ విలీనం మే 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ అవసరాల కోసం ఇకపై ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విలీనం వలన బ్యాంకింగ్ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని భావిస్తున్నారు.