AP Election Results : ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది..జగన్ ను కూటమి నిలువరిస్తుందా?
AP Election Results : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ కంటే ఏపీలో ఏ పార్టీ విజయం సాధించబోతుందో అనే ఉత్కంఠ, ఆసక్తి అందరిలో నెలకొన్నాయి. దేశంలోనే అత్యంత ఆసక్తిదాయకంగా ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రం అట్టుడికిపోయింది. దీంతో అందరి చూపు ఏపీ వైపే ఉందనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 81శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పడంలో విఫలమయ్యాయి. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో చెప్పడం కష్టంగా మారింది. వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కో విధంగా చెప్పడం తప్ప చేసిందేం లేదు. అసలు ఫలితాలు వస్తేనే విజేత ఎవరో చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం.
ఏపీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటే తమదేనని రెండు ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. అయినా కూడా అంతర్గతంగా మాత్రం నేతల్లో భయం మాత్రం ఉంది. ఓటర్ తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం అయి ఉండడంతో.. అవి ఓపెన్ చేస్తేనే అసలు విజేత ఎవరో బయటపడుతుంది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉత్కంఠ పరిస్థితులకు నేటితో చెక్ పడనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.