Ministry of External Affairs : వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే..: భారత విదేశాంగ శాఖ
Ministry of External Affairs : వాస్తవాధీన రేఖను (LAC) గౌరవించడంతో పాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. అంతేగాకుండా సరిహద్దులో నెలకున్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉందనిP-12 తెలిపింది. కజఖిస్థాన్ లోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమావేశమయ్యారు. భారత్-చైనా సరిహద్దులో, ముఖ్యంగా లద్ధాఖ్ తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి నెలకున్న వివాదాల పరిష్కార మార్గాలపై ఇరువురు నేతల బృందం చర్చించింది. సైనిక, దౌత్య మార్గాల్లో ఈ ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువు మంత్రులు అంగీకరించినట్లు సమాచారం.
తూర్పు లద్ధాఖ్ లో సరిహద్దు వివాదం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. 2020లో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యం మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరగడం, అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సైన్యాలను మోహరించాయి. అనంతరం అనేక సార్లు సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. దాంతో కొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి.