H-1B Visa:అమెరికాలోనే హెచ్‌-1బి వీసాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌!

H-1B Visa:అమెరికాలో ప‌నిచేస్తున్న విదేశీ వృత్తి నిపుణుల హెచ్-1బి వీసాలను అమెరికాలోనే పున‌రుద్ధ‌రించ‌డానికి మార్గం సుగ‌మం అయింది. దీనికి అధ్య‌క్ష భ‌వ‌నానికి చెందిన నియంత్ర‌ణ సంస్థ ఓఐఆర్ఏ ఈ నెల 15న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. విదేవీ వృత్తి నిపుణుల‌కు అమెరికాలో ప‌ని చేయ‌డానికి ఇచ్చే అనుమ‌తి ప‌త్రాన్ని హెచ్‌-1బి వీసా అంటారు. సాధార‌ణంగా వీటి గ‌డువు మూడేళ్ల‌లో తీరిపోతుంది. దాన్ని మ‌రో మూడేళ్లు పొడిగించుకోవ‌డానికి వీసాదారులు అమెరికా నుంచి స్వ‌దేశం తిరిగి రావ‌డ‌మో మ‌రేదైనా దేశానికి వెళ్లి పున‌రుద్ద‌రించుకోవ‌డ‌మో చేయాలి.

ఈ ఏడాది ప్ర‌ధాని మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు హెచ్‌-1బి వీసాల‌ను అమెరికాలోనే పున‌రుద్ధ‌రిస్తామ‌ని బైడెన్ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. మొద‌ట 20,000 వీసాలు పున‌రుద్ధ‌రించ‌డానికి పైల‌ట్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. భార‌త్‌లో హెచ్‌-1బి వీసాల‌కు గిరాకీ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని, వాటి కోసం భార‌తీయులు నెల‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సి వ‌స్తోంద‌ని, ఇది అభిల‌ష‌ణీయం కాద‌ని న‌వంబ‌రులో అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి జూలీ స్ట‌ఫ్ వ్యాఖ్యానించారు.

భార‌తీయుల‌కు త్వ‌ర‌గా వీసాలు పున‌రుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో అమెరికాలోనే ఉన్న 20,000 మంది విదేశీ నిపుణుల హెచ్‌-1బి వీసాల‌ను డిసెంబ‌ర్ నుంచి మూడు నెల‌ల్లో అమెరికాలోనే పొడిగించ‌బోతున్నారు. ఈ పైల‌ట్ కార్య‌క్ర‌మంతో భార‌తీయులే ఎక్కువ‌గా ల‌బ్దిపొందుతార‌ని అమెరికా అధికారులు వివ‌రించారు.

TAGS