AP BJP : జగన్ రెడ్డి పాలనలో భూ ఆక్రమణలు, కబ్జాలపై సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన శ్వేతపత్రంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.. సీఎం విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందన్నారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ, ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయన్నారు. నీతి అయోగ్ డ్రాఫ్ట్ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. ప్రజల, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆహ్వానిస్తున్నాన్నారు.
జగన్ రెడ్డి పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారని.. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చుక్కల భూములు 22ఏ కింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు చాలా ఎక్కువగా ఉందన్నారు. అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలాది ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని తెలిపారు. అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయన్నారు. తిరుపతిలోని హాదిరాం మఠం భూములు కూడా గందరగోళం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరిగిన వైసీపీ అవినీతి చిట్టా బయట పెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులతో విశాఖపట్నంలో భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్లపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోస్తాలో ఒంగోలులో దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, విజయవాడ, గుంటూరులో పైవేట్ ఆస్తులు కబ్జాలు, నెల్లూరులో క్వార్ట్జ్, సిలికా సంపదను దోచేశారని తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అస్మదీయులకు జగన్ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ క్వారీలను చిన్నాభిన్నం చేశారన్నారు. జగన్ స్వంత జిల్లా కడపలో లో బెరైటీస్, సున్నపు రాయి త్రవ్వకాల అక్రమాలు ఆకాశాన్ని తాకాయన్నారు. వైసీపీ పార్టీ ఆఫీసుల కోసమని జిల్లాకొక ప్యాలెస్ నిర్మాణం కోసం అక్రమ భూ కేటాయింపులు చేశారన్నారు.