Kantara Hero : ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో.. చిన్న సినిమాగా వచ్చిన ‘హనుమాన్’ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.200కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.30కోట్ల బడ్జెట్ తో చిన్న తారాగణంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీశాడని ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కథలో దమ్ము, కథనంలో సత్తా ఉంటే చిన్న సినిమాగా వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలువడం పెద్ద కష్టమేమి కాదని ప్రశాంత్ చెప్పారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడి.. వాటన్నంటినీ వెనక్కి నెట్టి పండుగ విజేతగా నిలిచింది.
వాస్తవానికి ‘హనుమాన్’ కథ పలువురు స్టార్స్ ను వెతుక్కుంటూ పోయింది. హనుమంతుగా తేజా సజ్జా మొదటి ఆప్షన్ కాదు. కొంత మంది హీరోలు ఆ పాత్రను తిరస్కరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సముద్ర ఖని పోషించిన విభీషణుడి పాత్ర కోసం ముందుగా రిషబ్ శెట్టిని ఎంచుకోవాలని ప్రశాంత్ వర్మ భావించాడట. అయితే ఈ సమయం రిషబ్.. కాంతారా మూవీతో బిజీగా ఉన్నాడు. అందుకే కథ, అందులోని విభీషణుడి పాత్ర నచ్చినా రిషబ్ చేయలేకపోయాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
‘‘భవిష్యత్ లో మీతో తప్పకుండా పనిచేస్తా.. ఈసారికి మాత్రం కుదరడం లేదు’’ అంటూ రిషబ్ మర్యాదపూర్వకంగా చెప్పాడట. ఇక హనుమాన్ పార్ట్ 2పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నటించడానికి అగ్రహీరోలు సైతం ముందుకొస్తున్నారని తెలుస్తోంది. మరింత భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. హనుమాన్ క్లైమాక్స్ లో చూపించినట్టుగా వేలాది మందితో పోరాట సన్నివేశాలు ఉండే అవకాశం కనపడుతోంది. దీంతో ఈ సినిమాకు మరిన్ని కొత్త పాత్రలు క్రియేట్ చేయనున్నారు. బహుశా హనుమాన్-2లో రిషబ్ పాత్ర ఉండొచ్చేమో? ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.