Jawan : బిల్లు ఎక్కువైందని హోటల్ లో జవాన్ల వీరంగం

Jawan :ఎన్నికల విధులకు హాజరైన జవాన్లు వారి తిరుగు ప్రయాణంలో ఓ హోటల్ లో వీరంగం చేశారు. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి హైస్కూల్ లో విశ్రాంతి కోసం జవానులు ఆగారు. మంగళవారం మధ్యాహ్నం గుళ్లపల్లిలోని మిలటరీ పిచ్చయ్య అభిరుచి హోటల్ కు బిర్యానీ కోసం జవాన్లు వెళ్లారు. అక్కడ బిర్యాని తిన్నాక బిల్లు ఎక్కువగా ఉందని హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు. సర్ది చెప్పే క్రమంలో జవాన్లు సిబ్బందిపై దాడి చేశారు. జవాన్లలో ఒకరు పాఠశాలలో ఉన్న జవాన్లకు విషయం చెప్పగానే జవాను దుస్తుల్లో కొందరు అక్కడికి వచ్చి హోటల్ అద్దాలు పగులగొట్టారు. అక్కడ హోటల్ లో తింటున్నవారిపై దాడి చేశారు. దాడిలో గోవాడకు చెందిన గోపి అనే యువకుడికి పెదవులు పగిలి రక్తస్రావమైంది.

హోటల్ సిబ్బందిలో కొందరి దుస్తులు చెరిగాయి. యజమాని కుమారుడు నాగేశ్వరా రావు అడ్డుకునేందుకు యత్నించగా అతనిపై దాడిచేశారు. బయటకు వచ్చిన జవానులు జాతీయ రహదారిపై వచ్చిపోయే వారిపైనా దాడికి యత్నించారు. ఈ క్రమంలో జవాన్లలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామస్థులు జాతీయ రహదారిపై చేరుకుని హోటల్ ఎదుట నిరసనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రేపల్లె రూరల్ సీఐ మల్లికార్జునరావు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. పాఠశాలకు వెళ్లి ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ సాషితో మాట్లాడారు.

హోటల్ నిర్వాహకులు టీడీపీ వారు కావడంతో మండల వ్యాప్తంగా ఉన్న నాయకలు, కార్యకర్తలు స్టేషన్కు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐటీబీపీ అసిస్టెంగ్ కమాండెంట్ సాషి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడతానని పోలీసులకు చెప్పగా వారు సమ్మతించడంతో రాజీ చేశారు.

TAGS