America : పెరుగుతున్న అమెరికా మోజు.. అంత సీన్ లేదంటున్న అక్కడికి వెళ్లిన వాళ్లు

America

America

America : చదువుకున్న ప్రతి ఒక్కరికి అమెరికా వెళ్లాలన్న డ్రీమ్ కచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితులు మారాయని అంటున్నారు కొంతమంది. డాలర్ వాల్యూ, విశాలమైన ఇళ్లు తప్ప భారతీయులు అమెరికా వైభవం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. అమెరికాలో ఉద్యోగం, ఏడాదికి సుమారు కోటి రూపాయల జీతం అంటే ఇండియాలో ఉన్న వాళ్లు అబ్బో అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్లు తెలుస్తుంది వాళ్ల బాధలు ఏంటనేది. అక్కడ ఇంటి అద్దెలు, ఇన్సూరెన్సులు, ఓవరాల్ మెయింటేనెన్స్ ఖర్చంతా తీసేస్తే మిగిలేది చాలా తక్కువ.  ఒకవేళ జాగ్రత్తగా బతికి కాస్త ఘనంగానే పోగు చేసినా.. ఓ నలుగురు సభ్యులున్న కుటుంబం ఓ సారి ఇండియా ట్రిప్పు వేస్తే రూ.20 లక్షలు ఉష్ కాకి. సింగిల్ సంపాదన ఉన్నవాళ్లకి ఏడాదికి కోటి అనేది మిడిల్ క్లాస్ అనుకోవాల్సిందే. అదే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చెరొక కోటి సంపాదించుకుంటే ఓకే ఓకే. కానీ అందరికీ అంత లక్కుండదు కదా. గాలివాటంగా చదువుకుంటూ పోయి.. ఏదో ఇక కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకి మన దేశంలో కూడా అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.  నిజానికి ఇండియాలో నిరుద్యోగ సమస్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. ఒక సెక్టర్ అని కాదు.. ఫార్మా, రియాలిటీ, ఐటీ, ఇన్ ఫ్రా.. ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. కానీ యువతకు అమెరికా మోజు సహజమే. కానీ అక్కడికి వెళ్లిన చాలామందికి ఆ మోజు తీరిపోవడానికి పెద్ద సమయమేం పట్టదు.

కెరీర్ గ్రోత్ సంగతి ఏమో కానీ ఇక్కడ క్రైం రేట్, మన వాళ్లపై షూటౌట్లు భయపెడుతున్నాయి. అందుకే తిరిగి ప్యాకప్ అయిపోవడానికి నిర్ణయించుకున్నాను. ఇండియాలో రెండు కంపెనీల్లో ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడి కంటే ఇండియాలో సగం జీతమే వస్తుంది. కానీ ఇండియాలోని ఆ జీతంతో ప్రస్తుతం మిగిల్చేదాని కంటే మూడు రెట్లు మిగల్చగలుగుతాను అంటూ చెప్పుకొచ్చాడు రాజశేఖర్ మద్దినేని అనే యువకుడు.

2021లో అమెరికాకి వచ్చాను. గ్రాడ్యుయేట్ పూర్తి చేసాను. జాబ్ కూడా వచ్చింది. కానీ అనుకున్నంత హ్యాపీగా లేను. ఇక్కడ ఖర్చులకి పెద్దగా మిగులుతున్నది లేదు. పైగా లెక్కలు చూసుకుని జాగ్రత్తగా బతకాల్సి వస్తోంది. ఇండియాలో మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇక్కడ మా నాన్న కంటే ఎక్కువే సంపాదిస్తున్నా జస్ట్ మిడిల్ క్లాస్ ఫీలింగొస్తోంది అని మరో యువకుడు   సాయిదీపక్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అమెరికాలోని చాలా బడా కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో వేలాది ఉద్యోగాలను పీకేస్తున్నాయి. అమెరికాలో ఇచ్చే జీతాలకి బదులుగా సగం జీతానికో, మూడో వంతు జీతానికో ఇండియాలోనే కూర్చుని చేయడానికి బోలెడు దొరుకుతున్నారు. కనుక అమెరికాలో సీట్లు ఖాళీ చేసి ఇండియాలోని తమ బ్రాంచుల్లో సీట్లు పెంచే పనిలో కంపెనీలున్నాయి. అందుకే అమెరికాలో జాబ్ మార్కెట్ అలా ఉంది, ఇండియాలో ఇలా ఉంది. గత రెండేళ్ల క్రితం వెళ్లినవారిలో చూసుకుంటే 10మందిలో 5గురు ఇండియానే మేలని అంటున్నారు. వారిలో ముగ్గురు వెనక్కి వచ్చేస్తున్నారు.

TAGS