Danish tourists: : డెన్మార్క్ టూరిస్టుల గొప్ప మనసు: సిక్కిం కొండల్లో స్వచ్ఛత కోసం పాటుపడ్డారు!

Danish tourists
Danish tourists : ఉత్తర సిక్కిం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ముఖ్యంగా యుమ్‌థాంగ్ లోయ తన అందమైన పూల లోయలు, పర్వతాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇద్దరు డెన్మార్క్ టూరిస్టులు వచ్చారు. ప్రకృతి ఒడిలో పరవశిస్తున్న సమయంలోనే వారికి అక్కడ కనిపించిన దృశ్యం వారిని కలచివేసింది. వీధుల్లో ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర వ్యర్థాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి వారు బాధపడ్డారు.
సాధారణంగా చాలామంది పర్యాటకులు ఇలాంటి దృశ్యాలను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. కానీ, ఈ డెన్మార్క్ టూరిస్టులు మాత్రం ఇతరులకు భిన్నంగా ఆలోచించారు. ఇది తమ దేశం కాకపోయినా, పర్యావరణాన్ని పరిరక్షించడం తమ బాధ్యత అని భావించారు. వెంటనే వారు స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
తమ వెంట తెచ్చుకున్న కవర్‌ను తీసుకుని వీధుల్లో పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను ఏరి అందులో వేశారు. ఆ తర్వాత ఆ కవర్‌ను దగ్గరలోని డస్ట్‌బన్‌లో పడేశారు. వారి చర్య అక్కడున్న స్థానికులను, ఇతర పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సందర్భంగా ఆ డెన్మార్క్ టూరిస్టులు మాట్లాడుతూ, “ప్రకృతిని ప్రేమించడం, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇది మా దేశం కాకపోయినా, ఇక్కడి అందమైన ప్రకృతిని ఇలా కలుషితం చేయడం చూసి మేము బాధపడ్డాం. అందుకే మా వంతుగా శుభ్రం చేశాం” అని తెలిపారు.
డెన్మార్క్ టూరిస్టుల ఈ చర్య నిజంగా ప్రశంసనీయం. వారు తమ బాధ్యతను గుర్తించి, పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించారు. వారి ఈ గొప్ప మనసు అందరికీ ఆదర్శం. పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్రతి ఒక్కరూ వారి స్ఫూర్తిని పొంది, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచాన్ని అందించగలం.