JAISW News Telugu

Kandukuri Veeresalingam : తరాలు మారినా మరుపురాని మహా మనిషి ‘కందుకూరి’!

Kandukuri Veeresalingam

Kandukuri Veeresalingam

Kandukuri Veeresalingam : దక్షిణాదిలో సామాజిక సంఘ సంస్కరణ కర్తల్లో అగ్రగణ్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు. మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న ఆ కాలంలోనే హేతువాదాన్ని బలంగా వినిపించడమే కాదు బాల్యవివాహాలు అడ్డుకున్నారు. వితంతు వివాహాలను జరిపించిన మహనీయుడు ఆయన. కందుకూరి ఒక్క సంఘ సంస్కర్తే కాదు గొప్ప రచయిత, నాటకకర్త, హేతువాది..పలు రంగాల్లో ఆయన ప్రతిభావంతుడు. తెలుగు భాషలో ప్రచురితమైన తొలి స్వీయ చరిత్ర కందుకూరిదే కావడం గమనార్హం. అలాగే మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపించారు. తొలి సహవిద్యా పాఠశాలను ప్రారంభించినది కూడా ఆయనే. అలాగే తెలుగులో తొలి నవల రాసింది కూడా ఆయనే. ఈరోజు(ఏప్రిల్ 16) కందుకూరి జయంతి సందర్భంగా  ఆయన గురించి కొన్ని విషయాలు..

1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం జన్మించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. సమాజంలోని అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపడం వంటివి ఆయన పత్రిక అయిన ‘వివేకవర్ధిని’లో ప్రచురించారు. సాహితీ వ్యాసంగంలోనూ కందుకూరి కృషి తక్కువేమి కాదు. స్త్రీవిద్య కోసం ఉద్యమించడమే కాదు బాలికల కోసం పాఠశాలను కూడా ప్రారంభించారు. మగపిల్లలతో కలిసి ఆడపిల్లలు చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.

కందుకూరి సామాజిక సేవలో అన్నింటికంటే ప్రధానమైనది మహిళోద్ధరణ. ఆయన సతీమణి కందుకూరి రాజ్యలక్ష్మి తోడ్పాటుతో వితంతువు పునర్వివాహాల కోసం ఎనలేని కృషి చేశారు. దక్షిణ భారత దేశంలోనే తొలి వితంతు వివాహాన్ని ఆయన 1881 డిసెంబర్ 11న రాజమహేంద్రవరంలోని తన సొంత ఇంటిలో జరిపించారు. మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న ఆ కాలంలో వితంతు వివాహం చేయడం అంటే మాములు విషయం కాదు. ఆయన ఏకంగా 40 వితంతు వివాహాలు జరిపించడం గమనార్హం.

కందుకూరి ఆంధ్ర దేశంలో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది. సమాజ సేవ కోసమంటూ 1905 హితకారిణి సమాజం అనే సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు. అలాగే ఆయన 130 గ్రంథాలు రాశాలు. తెలుగులో కందుకూరిలా ఇన్ని రచనలు చేసినవారు లేరనే చెప్పవచ్చు. ఆయన రచనల్లో రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ప్రముఖమైనవి.

అలాగే పలు నాటకాలను కందుకూరి రచించారు. నాటక రంగానికి ఆయన చేసిన సేవల వల్ల ఆయన జయంతిని ఏపీ ప్రభుత్వం నాటకరంగ దినోత్సవంగా పాటిస్తోంది. తెలుగులో మొదటి ప్రహసనాన్ని కందుకూరి తన పత్రికలో ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలను ఆయన ప్రచురించేవారు.

కందుకూరి సమాజంలో దురాచారాలను నిర్మూలించడానికి కంకణం కట్టుకుంటే అనాటి మూఢ మనుషులు ఆయనను చాలా ఇబ్బందులు పెట్టారు. వంటవాళ్లు, నీరు తెచ్చేవారు ఆయన ఇంటికి రావడానికి నిరాకరించినా కందుకూరి వెనకాడలేదు. ఇప్పటి సమాజంలోనే మూఢ విశ్వాసాలు ఇలా ఉన్నాయంటే 150 ఏండ్ల కింద ఎలా ఉండేవో..ఎలాంటి మనుషులు ఉండేవారో ఊహించుకోవచ్చు. అయినా కందుకూరి వీరేశలింగం చేసిన కృషి శ్లాఘనీయమని చెప్పవచ్చు. అందుకే  తరాలు మారినా ఆయనను గుర్తుంచుకుంటున్నాం.

Exit mobile version