CM Revanth : రేవంత్ అధికారంలోకి వచ్చాక ఒక్క క్షణం కూడా రిలాక్స్ కావడం లేదు. తాము మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మరొకటి ఆరోగ్య శ్రీ పరిధి పది లక్షలకు పెంపు. ఇక మిగతా నాలుగు గ్యారెంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించారు. వాటి డాటా ఎంట్రీ కూడా జరుగుతోంది.
ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతగానో ఇబ్బందులు పడిన నిరుద్యోగులపై దృష్టి సారించారు. టీఎస్సీపీఎస్సీ బోర్డు గత చైర్మన్, సభ్యులను రాజీనామా చేయించారు. కొత్త చైర్మన్, సభ్యుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వాటి దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తోంది. వీటిని సెర్చ్ కమిటీ చూసి అర్హులైన వారిని చైర్మన్ గా, సభ్యులుగా ఎంపిక చేసి..కొత్త బోర్డును మరో వారం రోజుల్లో ప్రకటించనున్నారు. దీని తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే డీఎస్సీ అభ్యర్థుల కోసం వచ్చే నెలలో మెగా డీఎస్సీని ప్రకటించబోతున్నారు.
ఇదే సమయంలో.. గత ప్రభుత్వంలో రిటైర్ అయి కూడా వివిధ కొలువుల్లో ఉన్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వివరాల సేకరణ పూర్తయిన తర్వాత వీరిని తొలగించి.. ఆ స్థానాల్లో సీనియర్ ఉద్యోగులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక వీరి స్థానాలను కొత్త రిక్రూట్ మెంట్ల ద్వారా భర్తీ చేయనున్నారు. దీంతో ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న లక్షలాది నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు మరిన్ని పోస్టులు కలిపి కొత్తగా అనుబంధ నోటిఫికేషన్లు వేసేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాదిలో రెండు లక్షల పోస్టులు భర్తీ చేసి చూపిస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తూ వచ్చారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు యుద్ధప్రాతిపదికన నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను మేధావులు, నిరుద్యోగులు మెచ్చుకుంటున్నారు.