BRS : బీఆర్ఎస్ వైభవం ఇక గడిచిన గతమే!
BRS : మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అది ఉంటే జీవితం నాశనమే. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట అన్న చందంగా రాష్ట్రంలో తన పదవిని కాపాడుకోలేని కేసీఆర్ దేశయాత్రకు బయలుదేరి అభాసుపాలయ్యాడు కేసీఆర్. రాష్ట్రంలో కూడా అధికారానికి దూరం కావడం ఆయనకు చెంపపెట్టే. దొరికిన దానితో ఉండటమే మంచిది. కానీ ఏవో కలలు కంటే మొదటికే మోసం వస్తుంది. వాపును చూసి బలుపనుకుంటే దారుణంగా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. దాన్ని బీఆర్ఎస్ గా మార్చి దేశరాజకీయాలను మారుస్తానని బీరాలు పలికిన కేసీఆర్ సొంత ఇంట్లో నుంచే గెంటేసే దాకా తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం లేదు. పదేళ్లు నియంత ధోరణిలో వ్యవహరించిన తీరుకు బదులు తీర్చుకున్నారు. ఒకే దెబ్బకు అధికారం దూరమైంది. ప్రతిపక్ష పాత్ర మిగిలింది.
ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు విశ్వసించరు. వారి నక్క వినయాలు అందరికీ అర్థమైపోయాయి. ఇక వారి పార్టీ మనుగడ కష్టమే అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు రాకపోతే ఇక ప్రజలు మరిచిపోయినట్లే అంటున్నారు. దీంతో పరువు నిలబెట్టుకోవాలని కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా బస్సు యాత్ర చేస్తూ ప్రజలను కలవాలని అనుకుంటున్నారు.
2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అనేక ఒడిదుడుకుల మధ్య పార్టీని ముందుకు నడిపించారు. వైఎస్ మరణం తరువాత పార్టీ ఉద్యమ కార్యాచరణలో దూకింది. 2014లో తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. ఇక రెండు సార్లు టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. జీవితకాలం కేసీఆర్ సీఎంగా ఉంటారని నేతలు ప్రగల్భాలు పలకడంతో వారి అహంకార ధోరణి అందరిలో అసహ్యం కలిగింది.
2023 ఎన్నికల్లో కీలెరిగి వాత పెట్టడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇప్పుడు ప్రజల చెంతకు వెళ్తున్నారు. ఆనాడు గుర్తుకు రాని రైతుల కష్టాలు ఇప్పుడెలా గుర్తుకు వస్తున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వచ్చిన కష్టమే ఇప్పుడు బీఆర్ఎస్ కు వచ్చింది. ఇక ఏం చేస్తారో చూడాల్సిందే.