Tollywood : టాలీవుడ్ లో నాటి మెరుపులేవి.. మరీ ఇంత దారుణమా?
Tollywood : టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి దసరా, సంక్రాంతిని ఎంచుకుంటారు దర్శకనిర్మాతలు, హీరోలు. ఇక అగ్ర హీరోలైతే తమ సినిమాలను ప్రారంభించే రోజే పలానా తేదీన విడుదల చేస్తామంటూ ప్రకటిస్తుంటారు. గతంలో టాప్ హీరోల సినిమాలు దసరా, సంక్రాంతికి ఒక రోజు అటు ఇటుగా లేదా, ఒకేరోజు విడుదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండు సీజన్లలో సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతలు, హీరోలు పోటీపడ్డ సందర్బాలు ఉన్నాయి. ఈ రెండు సీజన్లలో పోటీని తట్టుకోలేక దాదాపు 20 ఏళ్ల క్రితం పెద్ద హీరోల సినిమాలకు కనీసం రెండు వారాలు లేదా అత్యవసరమైతే వారం వ్యవధి ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారు.
కానీ ఈసారి దసరా సీజన్ లో టాలీవుడ్ లో మెరుపుల కనిపించ లేదు. కనీసం ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యిందనే భావన లేకుండా పోయింది. కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ సినిమా దసరాకు రిలీజ్ చేశామని అనిపించుకున్నారే తప్ప పెద్దగా సౌండ్ మాత్రం చేయలేపోయింది. రజనీతో పాటు అమితాబ్, ఫహద్, రానా లాంటి భారీ కాస్టింగ్ తో తెరమొత్తం నింపేసినా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. కనీసం రజనీ మార్క్ సినిమా అని కూడా అనిపించుకోలేకపోయింది.
స్ర్టెయిల్ సినిమాలు అంతే..
చాలా రోజుల తర్వాత టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల మళ్లీ మెగాఫోన్ పట్టాడు. గోపీచంద్ తో కలిసి చేసిన ‘విశ్వం’ సినిమాను దసరా బరిలో నిలిపినా పెద్దగా ప్రయాజనం లేకపోయింది. కాస్తోకూస్తో టాప్ హీరోగా పేరున్న గోపీచంద్ కూడా దసరాకు సందడి చేయలేకపోయాడు. సక్సెస్ కోసం సంవత్సరాలుగా ఆపసోపాలు పడుతున్న సుధీర్ బాబు పరిస్థితి కూడా అంతే. ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో వచ్చినట్లు అనిపించాడే తప్ప కనిపించడం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక చిన్న సినిమాలో దుమ్ము రేపుతున్న సుహాస్ కూడా తొలిసారి దసరా బరిలో కనిపించాడు. ‘జనక అయితే గనక’ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ తన గత చిత్రాల స్థాయిలో ఈ సినిమాను నిలబెట్టలేక పోయాడు.
డబ్బింగ్ సినిమాలు అంతే..
గతంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ సీజన్లలో పోటాపోటీగా రిలీజ్ చేసేవారు ఈ దసరాకు అదీ కనిపించ లేదు. కన్నడ డబ్బింగ్ మూవీ మార్టిన్ ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జిగ్రా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిజన్ బ్రేక్ జోనర్ లో వచ్చిన ఈ మూవీలో ఆలియా పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డా సినిమా మాత్రం నిలబడలేదు. మొత్తనికి ఈ దసరా సీజన్ ని ఫిలిం ఇండస్ర్టీకి చేదునే మిగిల్చింది.