AP Elections:తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ మావేశాలు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ తరహాలో ఏపీలోనూ అదే తరహా ఫలితాలు వస్తాయిని, ప్రభుత్వం మారుతుందనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కూడా బయటికొస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి – ఏప్రిల్ కంటే ముందే వచ్చే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటీఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదలవుతుందని విశ్వసనీయ సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే సమాచారాన్ని రాష్ట్న ఎన్నికల కమీషనర్‌కు పంపించినట్లుగా తెలిసింది. దీని ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సామావేశాలు నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో సున్నితమైన నియోజక వర్గాలు, ఫ్యాక్షన్ ప్రభావిత నియోజక వర్గాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. పోలింగ్‌కు సిద్ధంగా ఉండాల్సిన పోలింగ్ కేంద్రాలను కూడా ఈసీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ కంటే 20 రోజుల ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఆయన తన పార్టీ నేతల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
ప్రస్తుతం అనుమానంగా ఉన్న నియోజక వర్గాల నుంచి పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలను మారుస్తూ ఎన్నికల కోసం చక చక పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వర్గాలు దీన్ని వైకాపా ఓవరాక్షన్‌గా అభివర్ణిస్తూనే జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఈ విషయంలో కసరత్తులు మొదలు పెట్టారు. యువగళం నవశకం సభ సాక్షిగా పొత్తులపై స్పష్టతనిచ్చిన చంద్రబాబు ఇదే వేదికపై నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించడం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి బరిలో నిలిచే బలమైన అభ్యర్థుల జాబితాను ఆయన ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పొత్తుల భాగస్వామ్యాల్లో భాగంగా జనసేన పార్టీకి కేటాయించే సీట్లపై కూడా చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే సీట్లకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రచారానికి సంబంధించిన కీలక అప్ డేట్‌ని ఇవ్వనున్నారట.