CM Revanth : రేవంత్ పాలనలో మొదటి టాస్క్.. సక్సెస్ అవుతాడా?
CM Revanth : పదేళ్ల తర్వాత పాలనను బీఆర్ఎస్ నుంచి ‘హస్త’గతం చేసుకుంది కాంగ్రెస్. పార్టీ అధికారంలోకి వచ్చీ రావడంతోనే నామినేటెడ్ పోస్ట్ ల నుంచి బీఆర్ఎస్ నేతలు తప్పుకున్నారు. ఇక వాటి భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టా్ల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఆతృత కనిపిస్తుంది. వేగంగా నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డవారికి ఈ పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోస్టులకు డిమాండ్ రాను రాను పెరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ అధినాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
అయితే, సీఎం రేవంత్ మాత్రం మరోలా చెప్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు పని చేయవని చెప్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు దక్కుతాయని, అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయంటున్నారు. పార్టీలో 100 మందికిపైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జనవరి 3వ తేదీ (బుధవారం) కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీని తర్వాత పదవులకు సంబంధించి ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి లోగా తీపికబురు వింటామని నమ్ముతున్నారు.
ఎమ్మెల్యే స్థాయిలో పవర్ ఉన్న నామినేటెడ్ పోస్టులు 20 నుంచి 30 వరకు ఉంటాయి. వాటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, రైతు విభాగం. ఇలా ఏ విభాగానికి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కలేదు. వారికి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారి కన్నా.. పదేళ్లుగా కాంగ్రెస్ లో పని చేసిన వారికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని సీఎం చెప్తున్నారు.