JAISW News Telugu

Indias First Private Train : దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

Indias First Private Train

Indias First Private Train

Indias First Private Train : దేశంలోని తొలి ప్రైవేట్ రైలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.  తదుపరి ముంబై, అయోధ్య రూట్ లోనూ ఈ ప్రైవేట్ ట్రైన్ ను నడపాలని యోచిస్తున్నారు.

తిరువనంత పురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించవచ్చు.వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీ లను రెడీ చేశారు.

ఈ రైలులోని నాన్ -ఏసీ స్లీపర్ బోగిలో గోవాకు 4 రోజుల పర్యటన కోసం టికెట్ చార్జిగా రూ.13,999 వసూలు చేస్తారు. త్రీ టైర్ ఏసీ కోచ్ లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.15,150, టూ టైర్ ఏసీ కోచ్ లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.16,400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు రకాల కోచ్ లకు సంబంధించిన టికెట్ల రేట్లు ముంబై రూట్ లో రూ.15,050(నాన్ ఏసీ స్లీపర్), రూ.16,920(త్రీ టైర్ ఏసీ), రూ.18,825(టూ టైర్ ఏసీ) చొప్పున ఉంటాయి.

అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ లోని పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 8 రోజుల పాటు సాగే టూర్ ప్యాకేజీ రేట్ల వరుసగా రూ.30,550(స్లీపర్ నాన్ ఏసీ), రూ.33,850(త్రీటైర్ ఏసీ), రూ.37,150గా (టూ టైర్ ఏసీ) ఉంటాయి. ఇక 5ఏండ్ల లోపు పిల్లలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు సగం చార్జీ చెల్లిస్తే సరిపోతుంది.

Exit mobile version