Bhogapuram : భోగాపురం నుంచి తొలి విమానం ఎగిరేది అప్పుడే!

Bhogapuram

Bhogapuram

Bhogapuram : విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు జీఎంఆర్ గ్రూప్‌ను ఆదేశించారు. ఎయిర్ పోర్టు నిర్మించే ప్రాంతాన్ని తొలిసారిగా సందర్శించిన చంద్రబాబు నాయుడు, విమానయాన సంబంధిత పరిశ్రమల స్థాపనకు, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అదనంగా మరో 500 ఎకరాల భూమిని కేటాయించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా జీఎంఆర్ గ్రూప్‌ను కోరారు. విమానాశ్రయ స్థలంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు,విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయడం ప్రభుత్వ అజెండాలో ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు.   విమానాశ్రయానికి కావాల్సిన నీరు, విద్యుత్ సరఫరా కోసం జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని సీఎం చంద్రబాబు కంపెనీకి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాను చేస్తున్న సమీక్షల తరహాలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉత్తర ఆంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న విమానాశ్రయ నిర్మాణాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 2015 మే 15న ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు 2,700 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఎలాంటి సరైన కారణం లేకుండానే గత ప్రభుత్వం 500 ఎకరాల భూమిని తన వద్దే ఉంచుకుంది. జీఎంఆర్ గ్రూప్ దాని సరైన వినియోగానికి కార్యాచరణ ప్రణాళికతో వస్తే మిగతా భూమిని ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విమానాశ్రయానికి, పరిసర ప్రాంతాలకు ప్రత్యేక నీటి సరఫరాకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కోరారు.

విమానాశ్రయానికి విజయనగరం ప్రెసిడెన్సీ మాజీ రాజు, అశోక్ గజపతి రాజు తండ్రి పివిజి రాజు పేరు పెట్టాలని స్థానికులు కోరగా, దానిని పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు. మూడేళ్ల లోపు పనులు పూర్తి చేసి తొలి విమానాన్ని రన్‌వేపై నడపాలనే లక్ష్యంతో ఆ సంస్థ పనులు చేపట్టనుంది. మొత్తం మూడు దశల్లో దీన్ని అభివృద్ధి చేయనుంది. ఏడాదికి తొలి దశలో 60 లక్షల మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో  1.80 కోట్ల మంది ఇక్కడి నుంచి ప్రయాణించేలా దీన్ని నిర్మించనుంది. ఒకేసారి ఇరవైకి పైగా విమానాల్లోంచి ప్రయాణికులు దిగేలా 22 ఏరో బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకురానుంది.

మొత్తం 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం  కానుంది. ఇందుకు గానూ దాదాపు రూ.4,592 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌.. కార్గో సముదాయం, విమానాల నిర్వహణ, మరమ్మతుల యూనిట్‌, ఏవియేషన్‌ అకాడమీ, ప్లాంట్‌ క్వారంటైన్‌, యానిమల్‌ క్వారంటైన్‌ వంటి వసతులు కల్పించనున్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్లు, కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ విభాగాల ఏర్పాటు చేయనున్నారు. పెద్ద విమానాలు దిగేందుకు అనువుగా 3.8 కిలోమీటర్ల రన్‌వే నిర్మించనున్నారు.

TAGS