Hydra : అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది.. హైడ్రా విషయంలో రేవంత్ స్పష్టం..
Hydra : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా) వచ్చినప్పటి నుంచి అక్రమ నిర్మాణ దారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పెద్ద పెద్ద సెలబ్రెటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఆక్రమణలు కనిపిస్తే చాలు హైడ్రా కూల్చివేతలకు దిగుతోంది. హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి కల. జలావాసాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా ఉండాల్సిందేనని బలంగా నమ్మిన సీఎం దాని పరిధిని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అక్రమ నిర్మాణాలతో పాటు నీటి ఆవాసాలపై హైడ్రా పోరాటం చేస్తుంది. అయితే కోర్టు స్టే ఇచ్చినా నిర్మాణాలను కూల్చివేయడంపై హైడ్రా, ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే రేవంత్ మాత్రం న్యాయ వ్యవస్థతో పోరాడేందుకు సిద్ధం అవుతున్నారు.
అనధికారిక నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే తాత్కాలిక స్టే ఉత్తర్వులను ఎత్తివేసేలా చూస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్రమ కట్టడాలను తొలగించుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆక్రమణ దారులు స్వచ్ఛందంగా నిర్మించిన నిర్మాణాలను ఖాళీ చేయించి ఇరిగేషన్ కు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు తమ నిర్మాణాలను మరో అనువైన ప్రదేశంలో నిర్మించుకోవచ్చు. అనధికార కట్టడాలను కూల్చివేసే బాధ్యత నాదే’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తోంది. దీనితో పాటు ఇకపై నిర్మాణాలు చేసుకోవాలంటే హైడ్రా ఎన్ఓసీ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలని నిబంధనల్లో చేరుస్తారని తెలుస్తుంది. దీంతో ఇక అక్రమణ దారులకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.