Indian Cricketers : భారత క్రికెటర్లను భయపెట్టిన అభిమాని..అసలు ఏం జరిగిందంటే..
Indian Cricketers : 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్ సాధించి భారత కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై ఎగురవేసిన టీం ఇండియా స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన టీమ్ ఇండియా ప్లేయర్లు.. సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. వరల్డ్ కప్ విన్నర్స్ ఓపెన్ టాప్ బస్‌లో నిలబడి రోడ్ షోలో సందడి చేశారు. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్ షో సుమారు గంటన్నరపాటు సాగింది. టీం ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. భారత ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపర్చగా.. తమ అభిమాన క్రికెటర్లను తమ ఫోన్లలో బంధించేందుకు అభిమానులు పోటీ పడ్డారు. రోడ్ షో ముగిసిన అనంతరం టీం ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ.125 కోట్ల నగదు బహుమతిని అందించింది.
ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో జరిగిన టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీలో టీం ఇండియా ప్లేయర్లను ఓ అభిమాని భయపెట్టాడు. ర్యాలీ కొనసాగుతుండగా ఓ క్రికెట్ అభిమాని చెట్టు పైకి ఎక్కాడు. ప్లేయర్లు ఉన్న బస్సు చెట్టు వద్దకు రాగానే ఆ అభిమానిని చూసి కంగారు పడ్డారు. తాజాగా అతడి ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ సాధించిన టీం ఇండియా ప్లేయర్లను వణికించింది ఇతడే అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ పూర్తయినా గానీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో టీం ఇండియా ప్లేయర్లు చిక్కుకుపోయారు. వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్ ఫ్లైట్‌లో ఇండియాకు తీసుకువచ్చారు.