Constituencies : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల కోలహలం నెలకొంది. దేశంలోని 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండ్రోజుల్లో నాలుగో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా నాలుగో విడతలో భాగంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇందులో ఏపీలో 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 4
ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన తమిళిసై చెన్నైసౌత్, ఓవైసీ మీద పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాలతో పాటు, తాజాగా సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ వివాదంలో చిక్కుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం కూడా చేరింది.
రాహుల్ గాంధీ కేరళ నుంచి వాయనాడ్, తమిళనాడు నుంచి తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, అక్కడి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరు స్థానాలతో పాటు దేవెగౌడ మనవడు పోటీ చేసిన హసన్ స్థానాలలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. హైదరాబాద్ స్థానానికి ఈ నెల 13న ఎన్నిక జరగనుంది. ఇక్కడ భారీ ఎత్తున ఓట్లు తొలగించడం, మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నాలుగు దశాబ్దాలుగా ఓవైసీల చేతిలో ఉన్న హైదరాబాద్ కంచుకోటను మాధవీలత ఈ సారి బద్దలు కొట్టగలదా అనే చర్చ నడుస్తున్నది. ఇక వాయనాడ్ లో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. రెండో నియోజకవర్గంలో తిరిగి ఈ సారి గతంలో యూపీ నుంచి ఓడిపోయిన అమేథీ నుంచి కాకుండా తన తల్లి సోనియా ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడం చర్చనీయాంశమైంది.
మరి రెండింట్లో నెగ్గితే రాహుల్ దేన్ని ఎంచుకుంటాడు ? వాయనాడ్ లో ఇంతకు గెలుస్తాడా ? లేడా ? అన్న చర్చ జరుగుతోంది. వాయనాడ్ లో రాహుల్ కు పోటీగా సీపీఎం నుంచి అన్నీ రాజా, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ గట్టి పోటీ ఇచ్చారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ ఆ రాష్ట్రంలో ఖాతా తెరువలేదు. దీంతో ఈసారైనా ప్రభావం చూపుతుందా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మరి ప్రజల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ 4 ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.