JAISW News Telugu

Indiramma Indlu : త్వరలోనే సొంతింటి కల సాకారం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Indiramma Indlu

Indiramma Indlu

Indiramma Indlu : తెలంగాణ వాసుల సొంతింటి కల సాకారం కానున్నది. సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణామంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో సీఎం రేవంత్‌ శనివారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఈ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తొలుత ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తారు.

స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు. నిధులు ఏయే దశల్లో విడుదల చేయాలనే దానిపై నిబంధనలు సిద్ధం చేయాలని, లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. సొంతజాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లు రూపొందించాలని పేర్కొన్నారు. ఇంటిలో తప్పనిసరిగా వంటగది, టాయిలెట్‌ ఉండేలా చూడాలని సూచించారు.

Exit mobile version