dog bit : తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలో ఏదో ఓ మూల ప్రతి రోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. హైకోర్టు ఆదేశించినా.. కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. రోజుకో చోట..కుక్కలదాడిలో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. బాలుడి పురుషాంగాన్ని వీధి కుక్క కొరికివేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ సబితా నగర్లో ఓ కుటుంబం గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఇవాళ ఉదయం గుడెసెలోకి ప్రవేశించిన వీధి కుక్క.. ఏడేళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలుడి పురుషాంగాన్ని సగానికి పైగా కొరికేసింది. ఈ ఘటనతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బాలుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇక 20 రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయపోల్ గ్రామానికి చెందిన శివ, మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్ గౌడ్ అదే గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 12న పాఠశాల ఆవరణలో బాలుడు ఆడుకుంటుండగా.. ఓ వీధి కుక్క దాడి చేసింది. నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరిస్థితి మెరుగుపడి డిశ్ఛార్జ్ అయ్యాడు. అయితే మూడ్రోజుల క్రితం బాలుడికి జ్వరం తీవ్రం కావటంతో కామినేని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.