Local Reservations : ప్రైవేట్ సెక్టార్ లో లోకల్ రిజర్వేషన్ల రగడ
Local Reservations : కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్ బిల్లు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ బిల్లుపై పారిశ్రామికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ రంగంలో ఒక్కసారిగా అలజడి రేగింది. నాస్కామ్ సహా పలు పారిశ్రామిక సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. దీనికి తోడు పొరుగు రాష్ట్రాలు ఇదే అదునుగా చేసుకుని పరిశ్రమలను పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుక కరుచుకుంది. దీంతో ఈ బిల్లు తూచ్ అంటూ వెనక్కి తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టును తొలగించారు. ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉందని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రపంచీకరణతో యావత్ ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి పారిశ్రామికవేత్తలు వారితో మానవవనరులు తరలివెళ్లాయి. ఇలాంటి సమయంలో కర్ణాటక సర్కార్ తీసుకొచ్చిన ఓ వివాదాస్పద బిల్లు మొత్తం రాష్ట్రాన్నే గడగడలాడించింది. ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఆయా పరిశ్రమలో సి, డి గ్రేడ్ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని చట్టం చేసింది. మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్‌మేనేజ్‌మెంట్‌లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో ఒక్కసారిగా పారిశ్రామికవర్గాలు భగ్గుమన్నాయి. సిలికాన్ సిటీగా పేర్గాంచిన బెంగళూరు ఐటీ ఇండస్ట్రీలో అలజడి రేగింది. ఈ నిర్ణయాన్ని ఐటీ ఇండస్ట్రీ సమాఖ్యా నాస్కామ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతర పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.
కర్ణాటకలో కొంతకాలంగా కీలకమైన ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికి దక్కుతున్నాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలన్నీ బయటి నుంచి వచ్చిన వారే నిర్వహిస్తున్నారని, స్థానికులకు అవకాశం కల్పించడం లేదని నిరసనలు కొనసాగుతున్నాయి. కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో చెలరేగిన అలజడిని పొరుగు రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఈ మేరకు ఏపీ ఐటీమంత్రి లోకేశ్ తక్షణం స్పందించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని నాస్కామ్‌ను కోరారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పితే ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులిస్తామని ఆహ్వానం పలికారు. విశాఖ, అమరావతి సహా ఇతర ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు ఉన్న అవకాశాలను వివరించారు. మానవ వనరులకు కొరతే లేదని ఎక్స్ వేదికగా తెలిపారు. అటు కేరళ రాష్ట్రం సైతం కన్నడ పరిశ్రమలకు గాలం వేసింది.