AP Development : ఏపీ అభివృద్ధి ఆయనతో అయ్యేది కాదు..గత ఐదేళ్లలో చూసిందే కదా
AP Development : 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి రాష్ట్రానికి రాజధాని లేకుండా కేంద్రం అన్యాయం చేసిందని ఏపీ ప్రజానీకం తెగ బాధపడింది. ఆదాయం, ఉపాధి లేకుండా ఏపీ భవిష్యతును దెబ్బకొట్టారన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. దాని ఫలితంగానే ఏపీలో జరిగిన మొదటి ఎన్నికలలో రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించి.. సమర్థత గల పార్టీని ఎన్నుకోవడానికి ఏపీ ఓటర్లు సై అన్నారు. ఆ సమయంలో ఏపీ ప్రజలు సంక్షేమం మీద కాకుండా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి ఎన్నికలను పూర్తి చేశారు. హైదరాబాద్ తో పోటీ పడే మరో మహా నగరం తమ రాష్ట్రానికి కూడా అవసరమని నమ్మి దాదాపు 33 వేల ఎకరాల భూమిని అమరావతి రైతులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి త్యాగం చేశారు. అలాగే పోలవరం పూర్తి చేయడానికి అక్కడి స్థానిక ప్రజలు కూడా తమవంతు సాయంగా గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇదంతా ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమానికి ఆశపడో, ఆరాటపడో తీసుకున్న నిర్ణయాలు కాదు.
రాష్ట్ర భవిష్యతును దృష్టిలో ఉంచుకుని ఒక ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు చేసిన త్యాగాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వారి త్యాగాలకు ఫలితాలకు ఇచ్చేందుకు తనకు కేటాయించిన ఐదేళ్ల కాలాన్ని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ చంద్రబాబు పాలన కొనసాగించారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఉచ్చులోపడిన ఏపీ వాసులకు కట్టడాలు కాదు కూల్చివేతలను పరిచయం చేశాడు జగన్. గొప్పగా నవరత్నాల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ అభివృద్ధితో కాకుండా అప్పులతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సర్కార్ భవనాలను తాకట్టు పెట్టి, రోడ్లు, మౌలిక వసతులను పక్కన పెట్టి, రాజధాని, పోలవరం రాష్ట్రానికి అవసరం లేదన్న విధంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి ప్రభుత్వ పథకాలకు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలాన్ని అప్పులతో నెట్టుకొచ్చింది. ప్రతిపక్షాలు మీద కక్ష సాధించడానికి, కేవలం బటన్ నొక్కడానికే ఈ సమయాన్ని వాడుకుంది వైసీపీ.
రేపు తేలనున్న ఫలితాల్లో టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినా సంక్షేమ కార్యక్రమాలకు కొదవలేదు. నవరత్నాల పేరుతో వైసీపీ, సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ రెండు కూడా తమదైన శైలిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు. కానీ అటు సంక్షేమం తో పాటు రాష్ట్రానికి ఇటు అభివృద్ధి కూడా జరగాలంటే అది వైసీపీ తో సాధ్యం కాదని ఈ ఐదేళ్ల పాలనతో జగన్ నిరూపించారు. వైసీపీ పాలనలో ప్రభుత్వాన్ని నమ్మి ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. గతంలో ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి పోయాయి. ఈ పరిస్థితులలో 2024 లో జరిగిన ఎన్నికలలో ప్రజలు సంక్షేమానికి ఓటేశారా..? అభివృద్ధి వైపు నిలబడ్డారా..? అనేది తేలాలంటే మరో రోజు వేచి ఉండాల్సిందే.