Tender Vote : తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయ్యారు. మిర్యాలగూడలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు నవజీవన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే వారి ఓటు వేరేవారు వేశారని పోలింగ్ సిబ్బంది చెప్పడంతో అసహనానికి గురయ్యారు. వారి కుమారుడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంతో అధికారులు టెండర్ ఓటు ద్వారా ఓటుహక్కు కల్పించారు.
అలాగే, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన చిలువేరి శ్రావణి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లింది. అప్పటికే ఆమె ఓటును ఎవరో వేసినట్లు అధికారులు గుర్తించారు. తాను ఓటు వేస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రిసైడింగ్ అధికారితో మాట్లాడిన అనంతరం ఆమెకు టెండర్ ఓటు కల్పించారు.