Central employees : ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడో సారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి సారి బడ్జెట్ పెట్టబోతోంది. దీంతో ప్రతీ రంగం నుంచి పెద్ద ఎత్తున ఆశలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ ఉంటుందని ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో ఆర్థిక వృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపడతారన్న దానిపై ఒక్కో రంగం ఒక్కో విధంగా ఆశలు పెట్టుకుంది.
మధ్య తరగతితో పాటు వేతన జీవులకు ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయిన విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(3) కింద ఉద్యోగులు హౌజ్ రెంట్ పై పన్ను మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే, శాలరీలో హెచ్ఆర్ఏలో భాగమై ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఆదాయపు పన్ను నిబంధన 1962లోని రూల్-2ఏ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ మినహాయింపు మొత్తంను కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న హెచ్ఆర్ఏ లిమిట్ మోడీ ప్రభుత్వం రాక ముందుది. ప్రస్తుతం సాధారణ నగరాలే కాదు.. సిటీ, మెట్రో నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగాయి. దీంతో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. హెచ్ఆర్ఏ పరిమితి పెంపు ద్వారా మధ్య తరగతి వారికి భారీ ఊరట లభిస్తుందని చెబుతున్నారు.
చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో మూల వేతనంలో 50 శాతంపై హెచ్ఆర్ఏ మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. దీంతో పాటు బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 40 శాతంగా క్లయిమ్ చేసుకోవచ్చు. ఇంటి రెంట్లు భారీగా పెరిగిన క్రమంలో 50 శాతం ఉన్న పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బేసిక్ శాలరీలో 10 శాతాన్ని అద్దె చెల్లింపుల నుంచి తీసివేయగా.. వచ్చిన మొత్తాన్ని మినహాయింపునగా పరిగణిస్తారు. దీన్ని 5 శాతానికి తగ్గిస్తే బాగుంటుందని కోరుతున్నారు. దీంతో మినహాయింపు పరిమితి పెరుగుతుందని చెప్తున్నారు. కొత్త పన్ను విధానంలోనూ హెచ్ఆర్ఏ మినహాయింపులు క్లయిమ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. జులై 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్రం ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.