Special status : బీహార్ కు ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం.. ఏపీకి కూడా అంతేనా..?

Special status

Special status

Special status : బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్ సభలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ ఐదు నిబంధనలు పెట్టిందని, ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించినట్లు కేంద్రం గుర్తుచేసింది. గతంలో బీహార్ కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసి 2012 మార్చి 30న నివేదిక ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎన్డీసీ నిబంధనల ప్రకారం బీహార్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లో అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పిందని కేంద్రం వెల్లడించింది.

జేడీయూ లోక్ సభ సభ్యుడు రామ్ ప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్డీఏతో మిత్రపక్షంగా కొనసాగుతున్న జేడీయూకు ఈ ప్రకటన పెద్ద షాక్. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న జేడీయూ ప్రధాన డిమాండ్ ను కేంద్రం బుట్టదాఖలు చేయడంతో నితీష్ కుమార్ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందు ఇప్పటికే చాలాసార్లు లేవనెత్తాయి. కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రత్యేక హోదా అంశం రాజకీయ ప్రచారాస్త్రంగా మిగిలిపోయిందే తప్ప కార్యరూపం దాల్చలేదు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం చెబుతున్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ భయం ఉందని అందువల్ల టీడీపీ ప్రత్యేక హోదాపై పట్టుపట్టాలని ప్రత్యేక హోదా సాధన సమితి సూచిస్తోంది.

TAGS