Rohit Sharma : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(70) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఓ అభిమాని..అనూహ్యంగా మైదానంలోకి అడుగుపెట్టాడు. నేరుగా క్రీజులో ఉన్న రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతడి కాళ్లు మొక్కాడు. హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అతడి వద్దకు వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సదరు వ్యక్తిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన వ్యక్తి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18తో కూడిన జెర్సీ ధరించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే గ్రౌండ్ లో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించాడు.
కాగా, ఆ వ్యక్తి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డి(20)గా గుర్తించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు క్రీడల్లో సహజంగా జరుగుతుంటాయి. క్రికెట్ కాదు ఇతర ఫుట్ బాల్ వంటి ఆటల్లో కూడా తమ ఆరాధ్య ఆటగాళ్లను తాకాలని, హగ్ చేసుకోవాలని అభిమానులు ఇలా చేస్తుంటారు. క్రికెట్ లో ఇలాంటి తరచూ జరుగుతుండడంతో ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఇలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే అభిమానులు ఇలాంటి చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లంటే అభిమానం ఉండడం సహజం. కానీ ఇలా భద్రతా చర్యలకు వ్యతిరేకంగా మైదానాల్లోకి ప్రవేశిస్తే ఆటగాళ్లు అభద్రతా భావానికి లోనై ఆటపై మనస్సు నిమగ్నం చేయలేరు. దాంతో పాటు అనవసరంగా కేసులు పాలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.