Car : ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. కానీ అందరం బతికే ఉన్నామని మాత్రం వారికి తెలిసింది. ఏం చేయాలో తెలియదు.. ఎక్కడున్నామో అర్థం కావడం లేదు. రోడ్డును విడిచిపెట్టి దాదాపు 200 అడుగుల లోయలో పడిపోయాం అని మాత్రం తెలుసు. అంత పెద్ద ప్రమాదానికి గురైతే హైబత్ తిని గుండెపోటో, హై బీపీతోనో హఠాన్మరణం సంభవించే ఛాన్స్ ఉంది. కానీ వాహనంలో ఉన్న వారందరూ ధైర్యంగా పైగా యాక్సిడెంట్ లో ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఆ తర్వాత వారికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.. వారు ఏం చేశారు..? ఎలా బయట పడ్డారు..? తెలుసుకుందాం.
శనివారం అర్ధరాత్రి 2 గంటలవుతుంది. తుపాన్ ప్రభావంతో చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. పొగమంచు కమ్మేసింది. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న కారు సారంగాపూర్ మండలం, చించోలి(బి) సమీపాన మహబూబ్ ఘాట్‌లో అదుపుతప్పింది. గమ్యం ఎడమ వైపునకు వెళ్లాలి. కానీ కుడి వైపునకు లోయలోకి దూసుకెళ్లింది. 200 అడుగుల దిగువకు దూసుకెళ్లి ఓ టేకు చెట్టును ఢీకొట్టింది. వారికి ఆ సమయంలో గుర్తుకు వచ్చింది డయల్ 100. పూర్తి వివరాలివీ..
హైదరాబాద్, సరూర్‌నగర్‌కు చెందిన అనగనమండ్ల రాధాకృష్ణ(57), అతని భార్య వెంకటదుర్గ (53), కుమారుడు ప్రేమ్‌సాయి (28) కారులో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఉన్న బంధువుల ఇంటికి కారులో బయల్దేరారు. రాధాకృష్ణ కారు నడుపుతున్నాడు. నిర్మల్ పట్టణం దాటి 10 కి. మీ.లు ప్రయాణించారు. మహబూబ్‌ఘాట్‌లోని చివరి మూడో ఘాట్‌లో కారు వెళ్తోంది. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో వాహనం అదుపు తప్పింది. ఇక ప్రమాదం జరిగిన తర్వాత తేరుకున్న వారు డయల్ 100కు ఫోన్ చేశారు. నిర్మల్ డీసీఆర్బీ సీఐ గోపీనాథ్, సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, డ్రైవర్ వీరు ముగ్గురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు కూడా సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. కానీ కారు లోయలో ఉంది. కారులో ఉన్న వారిని బయటకు తీసుకురావాలి ఎలా? అని ఆలోచించి 101కు కాల్ చేసి అగ్నిమాపక అత్యవసర సేవలకు సమాచారం అందించారు. నిర్మల్ అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకుంది. తాడుతో ఒక్కొక్కరిని తెల్లవారు జామున 3.15 కల్లా పైకి తీసుకువచ్చారు. నాగ్‌పుర్ వెళ్లాల్సిన వీరు కడ్తాల్ వద్ద దారి తప్పి నిర్మల్ మీదుగా మహబూబ్‌ఘాట్ వైపు వెళ్లారు. వారు నేషనల్ హైవేను ఆశ్రయించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు..
అభినందించిన మంత్రి సీతక్క
ప్రమాదంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క.. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలకు ఫోన్ లో అభినందనలు తెలిపారు. అంత రాత్రిలో స్పందించి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సీఐ గోపీనాథ్, ఎస్ఐ శ్రీకాంత్, అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.