Lok Sabha Elections 2024 : అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది. ఒక్కసారి పోయిందా మనల్ని పట్టించుకునే వారు ఉండరు. బెల్లం ఉన్నచోటే ఈగలు ముసిరినట్టు.. అధికారం ఉన్నప్పుడు మన చుట్టూ అంతా తిరుగుతారు. అధికారం మన చేతుల నుంచి ఒక్కసారి జారిపోయిందా ఇక అంతే. ఇదే పరిస్థితి బీఆర్ఎస్ కు ఎదురవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ లోడ్ అయిపోయిన ఆ పార్టీ ఇప్పుడు ఖాళీ అయిపోతోంది. లోక్ సభ ఎన్నికల ముందు కారు దిగేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది.
తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడెం నగేశ్ బీజేపీ కండువా కప్పుకోవడం కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. నలుగురు కీలక నేతలు పార్టీని వీడడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి లక్ష్మణ్ సమక్షంలో వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ శ్రేణులకు గుబులు పుట్టిస్తోంది.
వీరు పార్టీ మారుతారని తెలిసినా.. కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఒక్క పార్టీ మారేవారిని అడ్డుకోవడానికి గులాబీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు పార్టీ మారుతున్న నేతలను ఆపేందుకు ప్రయత్నం చేసినా దాఖలాలు లేవు.
కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సైదిరెడ్డి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నాడని తెలిసినా కూడా ఆయన పట్టించుకోలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక తాజాగా పార్టీ నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పినప్పటికీ ఆయన కూడా గులాబీ అధినేతకు గుడ్ బై చెప్పేశారు. ఇక రానున్న రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.