Breath Analyzer : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి ఓ వాహనదారుడు బ్రీత్ ఎనలైజర్ ను లాక్కుని వెళ్లాడు. ఈ ఘటన ఈ నెల 27న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోయిన్ పల్లి లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నాగయ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27న అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా దాటిన అనంతరం వచ్చే ట్రాఫిక్ పాయింట్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ముందుగా వచ్చిన ఓ కారును నడుపుతున్న డ్రైవర్ కు పరీక్షలు చేయగా అతడు మద్యం తాగలేదని తేలింది.
వెనుకగా వచ్చిన కారును పోలీసులు ఆపారు. కారును బ్యారికేడ్లకు అవతలి వైపు తీసుకెళ్లిన కానిస్టేబుల్ డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని పరీక్షించేందుకు బ్రీత్ ఎనలైజర్ ఊదమన్నాడు. అతడు ఊదినట్లే నటించి కానిస్టేబుల్ చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్ ను లాక్కుని ఉడాయించాడు.
తేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వర్షం కురుస్తుండడం, అర్ధరాత్రి ట్రాఫిక్ లేకపోవడంతో నిందితుడు కారును వేగంగా తీసుకెళ్లి పోవడంతో నెంబరును గుర్తించలేక పోయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.