JAISW News Telugu

KTR fire : మూసీ చుట్టూ అతిపెద్ద కుంభకోణం.. ఇదే కాంగ్రెస్ పన్నాగం అంటూ.. కేటీఆర్ ఫైర్..

KTR fire

KTR fire

KTR fire on Congress : మూసీ నది ప్రాజెక్టు ముసుగులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాజెక్టును ఆర్థిక వనరుగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన బడ్జెట్ ను రూ. 1.5 లక్షల కోట్లకు పెంచడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి మండిపడ్డారు.

గంగానది ప్రక్షాళనకు ‘నమామి గంగే’ ప్రాజెక్టును తీసుకువచ్చారని, ఇదే దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టని దీనికి రూ. 40 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారు. కానీ మూసీ ప్రాక్షాళనకు ఇన్ని లక్షల కోట్లా అని నిలదీశారు. కాంగ్రెస్ ఉద్దేశాలను ప్రశ్నించిన ఆయన ప్రతిపాదిత వ్యయాన్ని కుంభకోణంగా అభివర్ణించారు.

2,200 కిలో మీటర్ల పొడవైన గంగా నదికి రూ. 40 వేల కోట్లు సరిపోతే, మూసీ నది 55 కిలో మీటర్లకు కాంగ్రెస్ రూ. 1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. మూసీ ఆక్రమణల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి వినాశకుడిగా మారారని బీఆర్ఎస్ నేతగా కేటీఆర్ ఆరోపించారు. సరైన పునరావాస ప్రణాళికలు లేకుండా పేదల ఇళ్లను కాంగ్రెస్ కూల్చివేయడాన్ని ఆయన ఖండించారు.

మూసీ బాధితుల కోసం రేవంత్ రెడ్డి నియంత పాత్ర పోషిస్తున్నారన్నారు. న్యాయం కోసం కుటుంబాలు రోధిస్తున్నా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కవచంలా వాడుకొని ప్రజల నుంచి ధనాన్ని లాక్కుంటున్నారని’ కేటీఆర్ మండిపడ్డారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన ఖజానా నింపుకునేందుకు మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంకుగా చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నెరవేర్చని హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చి కాంగ్రెస్ కు తప్ప మరెవరికీ ప్రయోజనం చేకూర్చని ప్రాజెక్టుకు రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. గత 300 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అయినా రూ. 1.5 లక్షల కోట్లతో నది సుందరీకరణకు ఖర్చు చేస్తున్నారని, ప్రజాప్రయోజనాలు లేవని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా, అనవసరమైన ప్రాజెక్టులకు పూనుకొని ప్రజల వాస్తవ అవసరాలను తీర్చడంలో విఫలమైందని విమర్శించారు.

ఇందిరమ్మ కింద ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, ఇళ్లను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ఇంకెన్ని ఇళ్లను కూల్చివేస్తారు..? అధికారుల వెనుక దాక్కోవడం మానేసి ప్రజలను ఎదుర్కోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా కూల్చివేతలు చేయడాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం హైకోర్టులో సవాలు చేసిందని, వారు సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.

అవసరమైతే బీఆర్ఎస్ న్యాయపోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ అన్యాయాన్ని కొనసాగనివ్వబోమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. పేదల ఇళ్లను కాపాడేందుకు అవసరమైతే బుల్డోజర్ల ముందు నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. పేదలకు హాని కలగకుండా మూసీ సుందరీకరణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, 15 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలపడం సహా బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

Exit mobile version