liquor shops : నేటితో ముగియనున్న లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు..  క్యూలో ఉన్న వారికే ఛాన్స్

liquor shops

liquor shops

liquor shops : మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువు నేటి సాయంత్రం 7 గంటలతో ముగుస్తుందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో కొత్త రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందన్నారు. నమోదు చేసుకున్న వారు అర్ధరాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించే వారు రాత్రి 7 గంటలలోపు క్యూలో ఉంటేనే అర్హులని వివరించారు.

దరఖాస్తు పత్రాలతో 7 గంటల్లో ఎక్సైజ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు. దరఖాస్తుదారులు నియమాలను అనుసరించి, కార్యక్రమం సజావుగా పూర్తయ్యేలా సహకరించాలని అభ్యర్థించారు. 3396 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు 65,424 దరఖాస్తులు వచ్చాయన్నారు. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉంది.

మొదట్లో కాస్త మందకోడిగా సాగిన ఈ ప్రక్రియ చివరి నాటికి భారీ డిమాండ్ తో ముగియనుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా మద్యం దుకాణాలకు టెండర్లు వస్తున్నాయి. యూరప్ , అమెరికా నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అమెరికా నుంచి 20 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుండగా, 14న వేలం నిర్వహించనున్నారు.

TAGS