Political Leaders : ‘‘బూతుల నేతలకు బూత్ ల్లోనే సమాధానం..’’.. పెద్దలు చెప్పినా వినరు కదా నేటి నాయకులు!

Political Leaders

Political Leaders using unparliamentary words

Political Leaders : ‘‘ ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి..ఆ ప్రమాణాలను చక్కదిద్దాల్సిన అవసరం అందరిపై ఉంది. బూతులు తిట్టే నేతలకు ప్రజలు పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పాలి. నీతి, నిజాయితీ లేని వారికి తగిన గుణపాఠం చెప్పాలి’’ అని మొన్ననే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెలవిచ్చారు. పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై వెంకయ్య, చిరంజీవి, ఇతర పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ వేడుకపై వెంకయ్య, చిరంజీవి.. బూతుల నేతలపై విచారం వ్యక్తం చేశారు.

ఆ సన్మాన సభ పూర్తయిన గంటకే సీఎం రేవంత్ రెడ్డి కేఆర్ఎంబీపై ప్రెస్ మీట్ పెట్టారు. దీనిలో మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి సభలోనూ ఇదే కథ. ఇక రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు షరామాములే. బాల్క సుమన్ వంద అడుగులు ముందుకేసి సీఎంపై నానా దుర్భాషలాడారు.

పెద్దలు చెప్పి కనీసం ఒక్క రోజు కూడా కాలేదు..అధికార, ప్రతిపక్షాలు ఇలా బూతుల దండకాలు చదువుతుంటే జనాలు ‘‘ఏంట్రా బాబూ ఈ రాజకీయాలు’’ అని తలలుపట్టుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ‘‘బూతులు మైకులో చెప్పాలి.. నీతులు చెవిలో చెప్పాలి’’ అన్నట్టుగా మారిపోయాయి.

ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ గా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ..‘‘ పాగల్ గాడు, హౌ..గాడు. ఈ చెత్తనా.., చెప్పుతో కొడుతా, ఖబడ్దార్ బిడ్డా..’’ అంటూ బీప్ సౌండ్స్ లేకుండా తిట్టేశాడు. ఇలా నేతలు ఒకరికి మించి ఒకరు.. తిడితేనే మీడియాలో కవరేజీ వస్తుంది.. పెద్ద నేతలను తిడితే పెద్దనేతలం అయిపోతామనే ధోరణిలో ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉండడం దురదృష్టకరం.

గతంలో వాజ్ పేయి, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ లాంటి విలువలతో కూడిన గొప్పనేతలను చూసైనా ఇప్పటి రాజకీయ నాయకులు తమ మాటతీరు, ప్రవర్తన మార్చుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. బూతులు మాట్లాడేవారు, కబ్జాలు చేసేవారు, అవినీతి చేసేవారు, వేల కోటీశ్వరులు, హత్యలు చేసేవారికి ప్రస్తుతం రాజకీయాలు వేదికగా మారిపోయాయని, మేధావులు, ప్రజాస్వామిక వాదులు రాజకీయాల్లో వచ్చే పరిస్థితిలేదని అంటున్నారు. మంచి వాడు మౌనంగా ఉంటే చెడ్డవాడిదే రాజ్యం అవుతుంది. ఇలాంటి నేతలు అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేకుండా బూత్ లోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

TAGS