CM Revanth Reddy : తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ భవనాన్ని రూ.25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. చదువుకున్న విద్యార్థుల కొలువుల గురించి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా..? అని ప్రశ్నించారు. పేదలంతా గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, ఇది పేదల ప్రభుత్వమని సీఎం అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా సీట్ల వచ్చినా.. వారి ఆలోచనా విధానం మారలేదన్నారు. కేసీఆర్ గురుకుల పాఠశాలలకు ఎక్కడా సరైన భవనాలు నిర్మించలేదని తెలిపారు. బీఆర్ఎస్ కు మాత్రం 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారని సీఎం రేవంత్ చెప్పారు. విద్యార్థులను కూడా కేసీఆర్ కులాల వారీగా విభజించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ వేర్వేరుగా గురుకులాలు పెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.