Vinod Kumar : ఉన్నత విద్య సంస్థలను కరీంనగర్ కు తేవడమే తన లక్ష్యమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు.ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను నగరానికి తీసుకొస్తానని, అందుకోసం సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. విద్యా సంస్థ కోసం 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించినట్లు వివరించారు. ఎంపీగా గెలిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైలుమార్గం వేసేందుకు కృషి చేస్తానన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. కరెంట్ సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని, మళ్లీ ఇళ్లల్లో ఇన్వర్టర్లను కొంటున్నారని అన్నారు. బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలన్నారు. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా.. విధ్వంసం కోరుకుంటారా.? అని ప్రశ్నించారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి కోసం ఆలోచించింది తానేనని తెలిపారు. మోదీ పదేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని వినోద్ కుమార్ ఆరోపించారు.