Ayodhya Ram Idol : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరి కొన్ని గంటల్లోనే జరుగనుంది. దశాబ్దాల కల సాకారం అవుతుండడంతో దేశ వ్యాప్తంగా ఇవాళ జైశ్రీరామ్ అంటూ ర్యాలీలు, పూజలు, భజనలు చేస్తున్నారు. కొందరు ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. దేశం మొత్తం భక్తపారవశ్యంతో ఊగిపోతోంది. ఈసందర్భంగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి పలు అంశాలను తాజాగా వెల్లడించారు.
161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా చేపట్టిన మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1100కోట్లకు పైగా ఖర్చు అయినట్టు ఆయన తెలిపారు. మొత్తం పనులు పూర్తిచేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు.
51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చిన విషయం తెలిసిందే. మొత్తం మూడింటిలో.. మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. మిగతా రెండింటిని ఆలయంలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. వాటిలో ఒక దాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. ‘‘పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది.. 25-30 అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు. అందుకే పెద్ద మూర్తి అవసరమైంది..’’ అని ఆయన చెప్పుకొచ్చారు.