Nara Lokesh : ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గాడితప్పిన పాలనను ప్రస్తుత సీఎం చంద్రబాబు సరిదిద్దే క్రమంలో అత్యంత బిజీగా ఉంటున్నారు. ఆయన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేష్ నంబర్ టూగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. అందుకే ఆయన దగ్గరకు సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజలతో పాటు ఇతరులు కూడా లోకేష్ ను వాట్సాప్ లో సైతం సంప్రదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా వాట్సాప్ మెసెజ్ పంపిస్తే నారా లోకేష్ స్పందిస్తున్నారు. ఇటీవల కొంత మంది విద్యార్థుల సమస్యలను ఆయన పరిష్కరించిన విధానానికి భారీ పబ్లిసిటీ వచ్చింది. దీంతో చాలా మంది ఆయనకు వాట్సాప్ చేయడం మొదలు పెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్ ను దాని మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది.
వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని మంత్రి నారా లోకేష్ ప్రజలను కోరారు. సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in కి పంపాలన్నారు.
సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రతి రోజు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్‌ను ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సప్‌కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకెళితే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్‌కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సనల్ మెయిల్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు.