Avinash Reddy Affidavit : వైఎస్ జగన్ చిన్నాన వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను సీబీఐ అన్యాయంగా ఇరికించిందని అవినాష్ వాదిస్తున్నాడు. షర్మిల, సునీతా రెడ్డి, బాబు, పవన్ అందరూ ఈ హత్య గురించి పదే పదే మాట్లాడడమే కాకుండా తనను వేలెత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని ఎన్నికల సంఘంతో ఆదేశాలు కూడా జారీ చేయించుకున్నారు.
కానీ, ఇప్పుడు ఆయనే కేసు గురించి అఫిడవిట్‌లో పేర్కొనవలసి వచ్చింది. ఆయన మళ్లీ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తుండడంతో నిన్న (ఆదివారం, ఏప్రిల్ 21) నామినేషన్ వేసేప్పుడు అఫిడవిట్‌లో, అభ్యర్ధుల నేర చరిత్ర కాలమ్‌లో వివేకా హత్య కేసుకు సంబందించి వివరాలు ఇవ్వాల్సి వచ్చింది.
తాను 2 క్రిమినల్ కేసుల్లో నిందితుడిని, తనపై వివేకా హత్య నేరం కింద సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది, ఈ కేసులో తాను ఏ-8గా ఉన్నాను అని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.హత్య కేసులో కుట్ర, సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు సీబీఐ మరో అభియోగం మోపిందని అవికాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 2 కాక మైదుకూరులో మరో క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వివేకా హత్యపై ఎవరూ మాట్లాడకూడదని అవినాష్ కోరుకున్నా.. ఆయనే అఫిడవిట్‌లో ఇవన్నీ పేర్కొనవలసి రావడం, ఈ వివరాలు మీడియాలో ప్రముఖంగా రావడం దేవుడి స్క్రిప్టే అనుకోవాలి.
అవినాష్ అఫిడవిట్‌లో తనకు, తన భార్య సమతకు కలిపి మొత్తం రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. కడప, విశాఖ జిల్లాల్లో మొత్తం 61.3 ఎకరాల భూములు ఉన్నాయని అవినాష్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.