Topudurthi : అప్పుడే నేను మీసం గీయించుకుంటా: ‘తోపుదుర్తి’ తొండిమాటలు
Topudurthi : ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయంతో వైసీపీ నేతలకు నిద్రకరువైంది. స్వయంగా జగనే ప్రెస్ మీట్ లో ఏడ్చినంతా పనిచేశారు. అమ్మఒడి ఎటుపోయిందో..దీవించిన అమ్మలక్కలు ఎక్కడికెళ్లిపోయారోనంటూ బావురుమన్నారు. ఎన్నికల్లో వైనాట్ 175 సీట్ల టార్గెట్ తో బరిలో దిగిన వైసీపీ నేతలు ఒంటెద్దుపోకడలకు పోయారు. సిద్ధం సభలకు వచ్చేవారంతా జగన్ వెంటే ఉన్నారంటూ ప్రగాల్భాలకు పోయారు. తీరా ఓట్లు లెక్కిస్తే ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఓట్లు పాతాళానికి చేరాయి. వైఎస్ జగన్, పెద్దిరెడ్డి తప్ప ఒక్క మంత్రి గెలవకపోవడం కాదు కదా.. వైసీపీ కంచుకోట ఉమ్మడి కడప జిల్లాను సైతం టీడీపీ కూటమి బద్దలు కొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వైసీపీ నేతలు.
ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు పలువురు వైసీపీ అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తామని ఎన్నెన్నో శపథాలు చేశారు. వారిలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే(ప్రస్తుత మాజీ) తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎన్నికల్లో తనపై టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత గెలిస్తే గుండు, మీసం గీయించుకుంటానని చాలెంజ్ చేశారు. తీరా చూస్తే ఆయనపై పరిటాల సునీత 20వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు.
దీంతో ఆయన గుండు, మీసం ఎప్పుడు గీయించుకుంటారని టీడీపీ శ్రేణులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇతర ట్రోలర్స్ కూడా మంచి ముడిసరుకు దొరకడంతో ప్రకాశ్ రెడ్డి ట్రోల్ చేస్తూ నవ్విస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రెడ్డిని పలువురు విలేకరులు..మీ మీద ట్రోలింగ్ బాగా నడుస్తోంది..మీరు గుండు, మీసం ఎప్పుడు గీయించుకుంటారు, అన్నమాటకు కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. దీనికి ప్రకాశ్ రెడ్డి..‘‘కచ్చితంగా కట్టుబడి ఉంటా. మీసం తీయించుకుంటా. పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో సీటు రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.
ఆయన రాజకీయ సన్యాసం చేయాలి.. అలాగే పరిటాల సునీత తాను ఇచ్చిన హామీలన్నీ ఆరు నెలల్లో అమలు పరచాలి..అప్పుడే వారికి నన్ను మీసం గీయించుకోవాలనే ప్రశ్నించే అర్హత ఉంటుంది.. అలాగే ఆమె ఈ ఆరు నెలల్లో తన హామీలన్నీ నెరవేర్చకపోతే ఏం చేస్తారో చెప్పాలి. అప్పుడే నేను మీసం తీయించుకుంటా.. అందుకు నేను సిద్ధంగా ఉన్నా..’’ అని చెప్పుకొచ్చారు.