Harish Rao : ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే అంతే?
Harish Rao : పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ వాళ్లు చేతులెత్తేస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉంటాయని అనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో పైళ్లు, కంప్యూటర్లు ఉంటాయని గుర్తు చేశారు. లంకె బిందెలు ఉండటానికి అసెంబ్లీ గుప్తనిధులు దొరికే ప్రాంతం కాదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500, రుణమాఫీ లాంటి వాటిని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ చేతకాని హామీలిచ్చి ఇప్పుడు చోద్యం చూస్తుందని పేర్కొన్నారు. తాము సన్న బియ్యం ఇస్తామంటే దొడ్డు బియ్యం ఇచ్చే వారికి ఓటు వేశారన్నారు.
మార్చి 17 లోపు రుణమాఫీ, మహిళలకు రూ.2500, 100 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల మాఫీ లాంటి వాటిని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కర్ణాటకలో మాదిరి ఇక్కడ కూడా హామీలు హామీలుగానే ఉంటున్నాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల లోపు హామీలు అమలు కాకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో మెదక్ లో భారీగా ఓట్లు సాధిస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామనే భావనకు ప్రజలు వస్తున్నారు. నిజం తెలుసుకుంటున్నారు. కర్రు కాచి వాత పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.