AP Latest Survey : ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఏపీ రాజకీయాలు స్పీడందుకున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్ధమైపోయాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమయ్యాయి. అయితే ఎంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ చేతులు కలపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా టీడీపీ, జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే దానిపై పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. తాజాగా సర్వే నివేదికను విడుదల చేసింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన కూటమి 104 స్థానాలను గెలుచుకుంటుదని, అధికారంలో ఉన్న వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుందని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది.
22 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని ఈ సర్వే విశ్లేషించింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో సైతం టీడీపీ, జనసేన కూటమే విజయం సాధిస్తుందని, దానికి 18 స్థానాలు వస్తాయని తెలిపింది. వైసీపీ కేవలం 7 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో కూటమి 51.5శాతం, వైసీపీకి 42.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.
ఫిబ్రవరి 2వ వారం నుంచి 29వ తేదీ మధ్య ఈ సర్వే చేపట్టామని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ తెలిపింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 సెగ్మెంట్ల నుంచి 53,000 మంది అభిప్రాయాలను సేకరించామని, సర్వేలో పాల్గొన్నవారిలో 54శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నారని వివరించింది.